ఆందోళనఅక్కడ నుండి నేను వెనక్కి తాతతో పాటు ఊరు లోకి వచ్చేసాను.
తాత “బాబు.. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి?”
“భూపతి రాజు గారి భవంతికి దారి చెప్పు తాత”
“నేను అక్కడికే వెళ్తున్న. ఇంతకీ నువ్వు ఎవరు?”
“భూపతి రాజు గారి ఎస్టేట్ కి కొత్త నిర్వాహకుడిగా వచ్చాను కానీ ఆయన చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో?”
తాత “నన్ను బదిలీ చేస్తుంది నువ్వేనా?”
ఒక నిముషం నాకు మాట రాలేదు.
తాత నవ్వుతు “ఏంటి మౌనంగా ఉండిపోయావు.”
“ఏమి లేదు…”
ఒక క్షణం ఆగి “మీ పేరు?”
“మర్రిటి పోతన”
“పోతన గారు, మీరు ఏమి అనుకోను అంటే ఒక ప్రశ్న?”
“ఈ పిలుపు కన్నా ఇందాక వరకు నువ్వు పిల్చిన తాత అనే పిలుపే బాగుంది….”
నాకు కొంచెం ఊపిరి ఆడినట్టు అనిపించింది. “ఎందుకు మిమ్మల్ని బదలీ చేసారు.”
“వయసు వల్ల అవ్వచ్చు. పట్నం వాళ్లు అంటే ఆ మోజు కూడా ఉంటుంది కదా!”
నాకు ఆ తాత పైకి నవ్వుతూ కనిపించినా లోపల బాధ పడుతున్నాడు అని అర్థం అయ్యింది. ఆయన బాధను గుర్తించాలి అనిపించలేదు. మనిషి స్వార్ధం అలాంటిది. నా మిత్రుడు మౌనమే మేలు అనుకుని, అతనితో భవంతి వరుకు నడిచాను. భవంతి ముందు ఒక చిన్న ఇల్లు కనిపించింది. లోపలికి వెళ్తే ఆ ఇల్లు విశ్రాంతి గృహం అని అర్ధం అయ్యింది. అది ఎడమ పక్క ఉంటె కుడి పక్కన పెద్ద భవంతి. నేను రాజు గారు భవంతి అంటే నిత్య నూతనంగా ఉంటుంది అనుకున్నా కానీ ఆ భవంతి కొంచెం పాడుపడి పోతున్న స్థితిలో కనిపించింది.
పోతన: “నువ్వు ఈ రోజుకి ఈ అతిధి గృహంలో విశ్రాంతి తీసుకో. ఈరోజు నువ్వు ఎవరినీ కలవటం అవ్వదు. రేపు రాజు గారి కుటుంబ స్నేహితులు వస్తారు. వాళ్లతో నువ్వు మాట్లాడి ఉద్యోగంలో చేరవచ్చు.”
అతని మాట కాదనే అవకాశం నాకు లేదు. తల కూడా నొప్పిగా ఉంది. అందుకే ఆయన నీడ చూపిన వెంటనే నేను నిద్రలోకి జారుకున్నా.
రెండు రోజులు గడిచిపోయాయి. నేను ఎవరిని కలవలేదు, పోతన గారు నాతో ఉంటున్నా ఆయన నాతో మాట్లాడే అంత తీరికగా కనిపించలేదు. రెండు రోజులు ఆ చుట్టుపక్కల తిరిగాను. ఈ ప్రాంతం చాలా విచిత్రంగా ఉంది. వెలుగులో అందంగా, తొలకరి జల్లులో ఆనందంగా, వర్షంలో అలజడిగా, ఉరుములు మెరుపులలో హడలుగా అనిపించింది. ఇవన్ని క్షణంలో ప్రకృతిలో వచ్చే మార్పులు. ఎక్కువ సేపు పొగ మంచులో ఉంటుంది, అతి తక్కువ సేపు వెలుగు వస్తుంది.
ఈ రోజు కూడా పరిసర ప్రాంతాలు చూడటానికి వెళ్లిన నాకు ఊరు చివరిలో ఒక అందమైన చెరువు, అందులో కలువలు కనిపించాయి. అందులో స్నానం చేయాలని నా మనుసు ఉవ్విల్లూరి, బట్టలు తీసి స్నానాకి దిగబోతుండగా, ఆ నీళ్లలో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. అది చూసి వంటి మీద నూలు పోగు లేదు అన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే నేను నీళ్లలోకి దూకేసాను. తల నీటి పైకి పెట్టె సాహసం చేయలేకపోయాను. నీటిలో నుండి గజ్జల సవ్వడి వినిపించింది. అవి ఘల్లు.. ఘల్లుమంటూ దూరం వెళ్ళాక నేను నీటి పైకి వచ్చి చుసాను. అప్పటికి ఆ అమ్మాయి వెళ్లిపోయింది.